మాన్సాస్ ట్రస్టు బాధ్యతల బదలాయింపుతో పూసపాటి వంశంలో చెలరేగిన వివాదం... ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోతో తారస్థాయికి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌కి ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతిరాజును తప్పించి... ఆ బాధ్యతలు సంచైతా గజపతిరాజుకు అప్పగించడం వివాదానికి ఆజ్యం పోసింది. మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత, ఎంఆర్ కళాశాల వివాదం కొనసాగుతుండగానే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో... బాబాయ్-అమ్మాయి మధ్య దూరాన్ని మరింత పెంచింది.
తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది దేవాలయాలకు ఛైర్మన్‌గా తనను తప్పించడాన్ని.... అశోక్ గజపతిరాజు ఖండించారు. చట్టవిరుద్ధంగా, అర్ధరాత్రి జీవోలు ఇచ్చి... సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆక్షేపించారు. కుటుంబంలో ఎవరు ఉండాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించే స్థాయికి వచ్చిందని... ఇది చాలా ప్రమాదకరమని మండిపడ్డారు.