ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2021, 3:04 PM IST

ETV Bharat / state

హైకోర్టులో అశోక్‌ గజపతిని గెలిపించిన ఒకే ఒక్క పాయింట్‌ ఏంటి?

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ గిరీ వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంచైత నియామకం చెల్లదన్న హైకోర్ట్‌ తీర్పును..సవాల్‌ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇష్టారాజ్యాలు వద్దన్న అశోక్‌గజపతిరాజు.. తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకీ హైకోర్టులో అశోక్‌ గజపతిని గెలిపించిన ఒకే ఒక్క పాయింట్‌ ఏంటి..? ప్రభుత్వ వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? మాన్సాస్‌ ట్రస్ట్‌ తదుపరి వ్యవహారాలు... ఏ మలుపు తీసుకోబోతున్నాయ్‌?

mansas trust conflict going on
mansas trust conflict going on

మాహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్-మాన్సాస్ ట్రస్టును...... 1958లో పూసపాటి పీవీజీ రాజు స్థాపించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ కింద 108 ఆలయాలు, 14 వేల 800 ఎకరాల భూములున్నాయి . విద్యా సంస్థల నిరంతర మద్దతు కోసం ఆర్థిక సాయం అందించడానికి.. ట్రస్ట్ డీడ్ వారసత్వంగా 'ఎల్డెస్ట్ మేల్ లీనియల్ వారసుడు' గా..నిర్వచించారు. దాని ప్రకారం 1994లో పీవీజీ రాజు మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు పూసపాటి ఆనంద్ గజపతి రాజు ట్రస్ట్ ఛైర్మన్ అయ్యారు.

2016లో ఆనంద్ గజపతి మరణం తరువాత.. పీవీజీ రాజు రెండో కుమారుడైన అశోక్ గజపతి రాజు పగ్గాలు అందుకున్నారు. గతేడాది మార్చిలో రాత్రికి రాత్రే అశోక్ గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా తప్పించిన ప్రభుత్వం.. ఆనంద గజపతి రాజు కుమార్తె సంచైతా గజపతిరాజుకు పగ్గాలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ జీవోనుఅశోక గజపతిరాజు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. సంచైతను ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమించే అధికారం సర్కార్‌కు ఉందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు.

అశోక్‌గజపతిరాజు న్యాయవాదులు మాత్రం ప్రభుత్వ జీవో ట్రస్ట్‌ వీలునామా నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌గా పురుషుల అనువంశకత కొనసాగింపును మార్చాలంటే... ట్రైబ్యునల్ ద్వారానే సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ అభీష్టం మేరకు మార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అశోక్‌గజపతిరాజు వాదనతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకంతోపాటు మాన్సాస్‌ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిళ గజపతిరాజు, ఆర్ వీ సునీతప్రసాద్‌లను గుర్తిస్తూ ఇచ్చిన జీవోలనూ కొట్టేసింది. ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజును పునరుద్ధరించాలని స్పష్టంచేసింది.


న్యాయం గెలిచిందన్న అశోక్‌గజపతిరాజు.. మాన్సాస్‌ ట్రస్ట్‌కు రిపేర్‌ చేస్తామన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించి బాధ్యతలు చేపట్టాలని అశోక్‌గజపతిరాజు భావిస్తుంటే తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారంలో జరగబోయే పరిణామాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి.

ఇదీ చదవండి:mansas trust: రెండేళ్లలో ఎన్నో అలజడులు సృష్టించారు: అశోక్‌గజపతిరాజు

ABOUT THE AUTHOR

...view details