మాన్సాస్ ట్రస్టు చైర్మన్(Mansas Trust) విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. న్యాయపరంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా.. ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోర్టులో ప్రతీసారి చుక్కెదురవ్వడంపై ప్రభుత్వం ఆలోచించుకోవాలని హితవు పలికారు. 'దేశంలో ఎక్కడా లేనివిధంగా మాన్సాస్ వ్యవహారంలో వైకాపా ప్రభుత్వం తలదూర్చింది. ఇష్టానుసారంగా నియామకాలు చేసి, ట్రస్టు ప్రతిష్టను భ్రష్టుపట్టించింది. హైకోర్టు చెప్పినా ఇప్పటివరకు ఈవో నన్ను కలవలేదు. నేను ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదు. రెండోసారి ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తైనప్పటికీ..నేను అడిగినా వివరాలు ఇవ్వలేదు' అని ఆయన వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం అడ్డుగోలుగా వ్యవహరిస్తూ.. హిందూమతం, దేవాలయాలపై రాజకీయ దాడి చేస్తోందన్నారు. సింహాచలంలో సీతారాములు ఆలయంలో ధ్వజస్తంభం కూలడంపై అధికారుల వివరణ కోరతానన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని గత ఛైర్మన్ సంచయిత.. తన ఆర్భాటం కోసం రూ. కోటి ట్రస్టు సొమ్ముతో కార్లు కొనుగోలు చేశారన్నారు. ఏదో ఒక రోజు ఇవన్నీ బయటపడక తప్పదన్నారు. నాపై విచారణ చేస్తామని మంత్రులు ప్రకటనలు చేశారు.. ప్రభుత్వ విచారణపై నేను ఆందోళన చెందడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని పైడితల్లిని వేడుకుంటున్నానని అశోక్ తెలిపారు.