విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలికి చెందిన చుక్క రాము (36) కుటుంబం పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం విశాఖలో సీతమ్మధార వెళ్లి అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆయన భార్య బంగారమ్మ పుట్టినిల్లు రణస్థలం మండలంలోని మిందిపేట. వీరికి కుమార్తె స్వాతి (7), కుమారుడు భరత్ (3) ఉన్నారు. బయోమెట్రిక్ కోసం మంగళవారం ఉదయం విశాఖ నుంచి ద్విచక్ర వాహనంపై నలుగురు బయల్దేరారు. బస్సులో వెళ్లి సాయంత్రానికి వచ్చేస్తామని భార్య చెప్పినా రాము వినిపించుకోలేదు. ఇంటి నుంచి బయల్దేరిన కాసేపటికే మధ్యలో మద్యం దుకాణం వద్ద ఆపి తాగాడు. భయంతో బస్సులోనే వెళ్లిపోతామని బంగారమ్మ అనగా గట్టిగా కేకలు వేశాడు. చేసేది ఏమీలేక ఎక్కారు.
నెమ్మదిగా బండి నడపాలంటూ భార్య చెబుతూనే ఉంది. పేరాపురం వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి పక్కనున్న ఇనుప డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్తె స్వాతి తలకు గాయాలవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. బంగారమ్మ, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో చాలాసేపు అక్కడే ఉండిపోయారు. అటుగా వెళ్తున్న నాతవలసకు చెందిన ఆటోడ్రైవర్ దత్తి ఆదినారాయణ గమనించి సుందరపేట సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. స్వాతి తలకు ఎనిమిది కుట్లు వేసినా రక్తస్రావం ఆగలేదు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీహెచ్‌సీలో తల్లీ కుమారుడికి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జయంతి తెలిపారు.