ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొనసాగుతున్న పేర్ల మార్పు .. మొన్న ఎన్టీఆర్​ వర్సిటీ.. నేడు విజయనగరం జిల్లా ఆసుపత్రి - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

HOSPITAL NAME CHANGED IN VIZIANAGARAM : రాష్ట్రంలో పేర్ల మార్పు పరంపర కొనసాగుతోంది. గత నెలలో ఎన్టీఆర్​ వర్సిటీ పేరు మార్చిన ప్రభుత్వం.. తాజాగా విజయనగరంలో చరిత్ర కలిగిన మహారాజ జిల్లా ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా రాత్రికి రాత్రే మార్చింది. దీనిపై జిల్లా ప్రజలు, తెదేపా నేతలు ఆందోళన చేస్తున్నారు.

HOSPITAL NAME CHANGED IN VIZIANAGARAM
HOSPITAL NAME CHANGED IN VIZIANAGARAM

By

Published : Oct 7, 2022, 1:58 PM IST

Updated : Oct 8, 2022, 7:13 AM IST

MAHARAJA DISTRICT HOSPITAL NAME CHANGED : విజయనగరాన్ని.. గజపతిరాజులను వేరుచేసి చూడలేం.. అక్కడ ఉన్న చెట్టు, పుట్ట దగ్గర నుంచి ప్రభుత్వ ఆస్తులన్నీ వారివే.. ప్రజాసంక్షేమం కోసం వేల ఎకరాలను భూరిదానం చేసిన చరిత్ర రాజవంశీయులది. ఆ కోవలోదే విజయనగరంలోని మహారాజా ఆసుపత్రి. ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రాచుర్యం ఉన్న ఈ ఆస్పత్రికి మహారాజా పేరు తొలగించడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజయనగరంలో ప్రభుత్వాసుపత్రి అంటే దాదాపు ఎవరికీ తెలియదు.. కానీ మహారాజా ఆస్పత్రి అంటే మాత్రం ఉత్తరాంధ్రలోని ప్రతి ఒక్కరూ ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ ఆస్పత్రి చరిత్రను కనుమరుగు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. విజయనగరంలోని మహారాజా జిల్లా ఆసుపత్రి పేరును అధికారులు రాత్రికి రాత్రే మార్చటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాజా ఆస్పత్రి పేరు తీసివేసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం కలకలం రేపింది.

ఉత్తరాంధ్రలో కేజీహెచ్​ తర్వాత ఇదే పెద్ద ఆస్పత్రి: జిల్లాకు ప్రభుత్వం వైద్య కళాశాలను మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న కళాశాల పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఆస్పత్రినే బోధనాసుపత్రిగా వినియోగించనున్నారు. అందులో భాగంగానే పేరు మార్చినట్లు అధికారులు చెబుతున్నా.. మహారాజా పేరు కొనసాగించడంలో అభ్యంతరమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా మొత్తానికి పెద్ద ఆస్పత్రి ఉండాలన్న ఉద్దేశంతో 1983లో కంటోన్మెంట్ ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1988లో ఆసుపత్రి ప్రారంభించారు. అప్పటి నుంచి మహరాజా జిల్లా ఆసుపత్రిగానే కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో కేజీహెచ్​ తర్వాత ఇదే పెద్ద ఆస్పత్రి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనూ అశోక్ గజపతిరాజు ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేశారు. ఆస్పత్రి పేరు యథాతథంగా కొనసాగించాలని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది.

అందుకే పేరు మార్చారు: మహారాజా ఆస్పత్రితోపాటు ఎంతో ఖ్యాతిగడించిన ఘోషాసుపత్రిని కూడా కలిపి కూడా సర్వజన ఆసుపత్రిగా పేరు మార్చారు. వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా ఆస్పత్రిని బోధనాసుపత్రిగా మార్చారని.. ఇందుకు సంబంధించిన నియామకాలు, ఉత్తర్వులన్నీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పేరుతోనే ఉంటాయి కాబట్టి పేరు మార్చారని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. కొండకరకాం వద్ద వైద్యకళాశాల నిర్మాణం జరుగుతోంది. అది పూర్తయితే బోధనాసుపత్రి అక్కడికి తరలిపోనుంది. ఈమాత్రం దానికి ఎంతో ఘనచరిత్ర ఉన్న మహారాజా ఆస్పత్రి పేరు మార్చడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లా ఆసుపత్రి పేరు మార్పును ఖండించిన లోకేశ్​ :జగన్ పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. NTR హెల్త్‌ వర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని, ఇప్పుడు మహారాజా పేరు తీసేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబ్టటారు. విజయనగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చింది మహారాజ కుటుంబమని అన్నారు. దాన్ని కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసింది అశోక్ గజపతి రాజు అని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

తెదేపా నేతల ఆందోళన : ఈ విషయంపై తెదేపా శ్రేణులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. జిల్లాలో ఎన్నో ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపట్టిన విజయనగరం రాజుల పేర్లు తొలగించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ మార్పు జరిగిందని.. దీనిని జిల్లా ప్రజలు ఏ మాత్రం హర్షించరని తెదేపా నేతలు తెలిపారు. ఇప్పటికైనా ఆసుపత్రి పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెదేపా నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details