విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో ఓ ప్రేమ కథ విషాదాంతమైంది. పెద్దలు వారి ప్రేమను అంగీకరించలేదని తోటపల్లి బ్యారేజి వద్ద నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితం తోటపల్లి నాగావళి నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సింహాచలం ఆధ్వర్యంలో పార్వతీపురం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు జలాశయంలో గాలించారు.
బుధవారం ఉదయం స్పిల్వేకు దగ్గరలో గాయత్రి, రాకేష్ మృతదేహాలు దొరికాయి. డ్యామ్కీ 200 మీటర్ల దూరంలో మృతదేహలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తమను వేధించినా కలిసి ఆనందంగానే జీవించామని... చావులోనూ తాము ఆనందంగా ఉన్నామని... ఇద్దరం కలిసి సంతోషంగా మరణిస్తున్నామని సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు. ఒకే చున్నీని కట్టుకొని నదిలో దూకినట్టుగా గుర్తించామన్నారు.