విజయనగరం జిల్లా సాలూరులో సుమారు 2100 లారీలు ఉన్నాయి. బొగ్గుతో లారీలు నడిచే రోజుల నుంచి ఇక్కడ ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం. దీనిపై ఆధారపడి డ్రైవర్లు, క్లీనర్లు, బాడీ బిల్డింగ్, కార్పెంటర్లు, టైర్లు, పెయింటర్లు, వెల్డర్లు, ఎలక్ట్రిషన్లు.. ఇలా సుమారు 30 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ జీవనం సాగిస్తున్నారు. అక్కడినుంచి ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు సరుకులు రవాణా జరుగుతుంటుంది.
కరోనా కారణంగా ఏడాదిన్నరగా కుదేలైన లారీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సమయంలో పెరుగుతున్న డీజిల్ ధరలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. మార్చిలో డీజిల్ ధర రూ. 78 ఉండగా.. ఇప్పుడది రూ. 103 కు పెరిగింది. కేవలం ఆరు నెలల కాలంలో 25 శాతం ధరలు పెరిగాయి. సాలూరు నుంచి ఒడిశాలోని రాయపూర్ వెళ్లి రావడానికి సుమారు 600 లీటర్ల డీజిల్ అవసరం. గతంలో రూ. 46,800 ఖర్చయ్యేది. ఇప్పుడు రూ. 61,800 అవుతుంది. సుమారు రూ. 15,000 అదనపు భారం పడుతోంది. ఇలా నెలలో ఒక్క లారీ నాలుగు ట్రిప్పులు తిరుగుతుందని.. ఈ లెక్కన 60 వేల వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది లారీ యజమానులు వాపోతున్నారు.
''ప్రస్తుతం కిరాయిలు లేక, డీజిల్ ధరల భారం మోయలేక సుమారు 1000 వాహనాలను అమ్మకానికి పెట్టారు. అయినా వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతి దసరాకు 40 నుంచి 50 కొత్త లారీలు వస్తుంటాయి. రెండేళ్లుగా ఒక్కటి కూడా రాకపోగా.. ఉన్నవాటిని అమ్ముకునే పరిస్థితి వచ్చింది.'' - సీతారాం, అసోసియేషన్ నాయకులు
చేతిలో రూ. 2 లక్షలు కనీస సొమ్ము ఉంటే ఫైనాన్స్ కంపెనీలు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటంతో.. చాలా మంది డ్రైవర్లు పొదుపు చేసుకున్న డబ్బులతో వాహనాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక వాటిని విక్రయించి తిరిగి డ్రైవర్లుగా మారుతున్నారు. మరికొందరు అప్పులపాలై రోడ్డున పడ్డారు. ఒక్కో లారీకి నెలకు రూ. 40 వేల వరకు నిర్వహణ ఖర్చులు, రూ. 60 నుంచి రూ. 70 వేలు ఫైనాన్స్ వాయిదాలు, మూడు నెలలకోసారి రూ. 8 వేలు రవాణా పన్ను, ఏడాదికి రూ. 60,000 బీమా.. వాహనం నడిచినా.. నడవకపోయినా ఇవి తప్పకుండా భరించాల్సి ఉండడంతో.. అనేకమంది తమ వాహనాలను అమ్మేందుకు మెుగ్గు చూపుతున్నారు. దీనికితోడు డీజిల్, విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయని వాపోతున్నారు.