ముఖ్యంగా సామాజికవర్గాల సమీకరణ, ఆర్థిక స్థోమత, బలగం అంశాలను దృష్టిలో పెట్టుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు అలక బూనుతుండడంతో అభ్యర్థుల ఎంపిక పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. గ్రామాలవారీగా నాయకులను పిలిచి చర్చిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఇందుకు నిదర్శనం..
మండలాల్లో ఇదీ పరిస్థితి..
బొబ్బిలి మండలంలోని 30 పంచాయతీల్లో చాలా వరకూ అభ్యర్థుల ఎంపిక రెండు పార్టీల్లోనూ ఇంకా కొలిక్కి రాలేదు. సుమారు 20 పంచాయతీల్లో అధికార పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. పలువురు సర్పంచి పదవులను ఆశించడంతో ఆ పార్టీ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందర్నీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెదేపా తన పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చినా కొన్ని ఇంకా ప్రకటించలేదు. అధిక పంచాయతీలు కైవశం చేసుకునేందుకు గ్రామాల వారీ సమావేశాలు నిర్వహించి నిర్ధేశం చేస్తున్నారు. రామభద్రపురం మండలంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 22 పంచాయతీల్లో ఇరు పార్టీల్లోనూ పోటీ చేసి వారి సంఖ్య చాంతాడాంత ఉంది. అధికారపార్టీ కొన్నిచోట్ల ఏకగ్రీవాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెదేపా అక్కడ ధీటైన అభ్యర్థులను దించేందుకు కసరత్తు చేస్తోంది. మేజర్ పంచాయతీలో తెదేపా నుంచి పోటీ చేసి వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని బుజ్జగించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. తెర్లాంలోని 33 పంచాయతీల్లో చాలా వాటికి అభ్యర్థుల ఎంపిక రెండు పార్టీల్లోనూ కొలిక్కి రాలేదు. బాడంగిలో 25 పంచాయతీల్లో ఇరుపార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపిక పూర్తికాలేదు. వైకాపా, తెదేపాల్లో చాలా పంచాయతీల్లో నువ్వానేనా అన్న పోటీ నెలకొంది. పూర్వవైభవం కోసం తెదేపా.. మెజారిటీ స్థానాలు కైవశం చేసుకునేందుకు అధికార పక్షం తెరచాటు మంతనాలు చేస్తున్నారు. నేతల సొంత మండలాలపై అవతలిపార్టీ నేతలు పాగా వేసేందుకు దృష్టి సారించారు. ఏకగ్రీవాలు లేకుండా ఇరుపార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.