భర్తతో మనస్పర్ధల కారణంగా ఓ తల్లి నాలుగేళ్ల కూతురిని హతమార్చింది. ఈ హృదయ విదారకమైన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాళ్లవలసలో జరిగింది. తాళ్లవలసకు చెందిన బంక శ్రీనుకు పూసపాటిరేగ మండలం వెంపడంనకు చెందిన మహాలక్ష్మితో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం పుట్టింటికి పంపేశాడు. ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు భార్య దగ్గరకు వెళ్లాడు. పెద్దకూతురుతో కలిసి తాళ్లవలసలోనే ఉంటున్న శ్రీను.. భార్య గర్భం దాల్చిందని తెలిసి అనుమానం పెంచుకున్నాడు. ఆ తర్వాత భార్యను చూడడానికి కూడా వెళ్లలేదు. ఇటీవల పెద్దల సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం చిన్న కూతురు రమ్యతో కలిసి మహాలక్ష్మి తాళ్లవలస వచ్చింది. అప్పటి నుంచి చిన్న కూతురును వదిలించుకోవలంటూ భార్యపై శ్రీను అనేక సార్లు ఒత్తిడి తెచ్చాడు. ఏమి చేయాలో తెలియని మహాలక్ష్మి.... చిన్నకూతురుతో కలిసి బావితో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. మొదటగా రమ్యను బావిలో పడేసిన మహాలక్ష్మి... కూతురి ఆర్తనాదాలు విని భయపడి ఆత్మహత్యను విరమించుకుంది. తాను చేసిన ఘోరాన్ని ఎవరికీ చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేసింది. తెల్లారేసరికి పాప కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు, బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాలవారు వెతికారు. బావిలో తేలిన రమ్య మృతదేహాన్ని గుర్తించారు. తన భర్త ఒత్తిడి మేరకే ఈ ఘోరం చేశానని పోలీసులతో మహాలక్ష్మి చెప్పింది.
నాలుగేళ్ల కూతురిని కడతేర్చిన తల్లి... భర్తతో మనస్పర్థలే కారణం
విజయనగరం జిల్లా డెంకాడ మండలం తాళ్లవలసలో ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురిని హతమార్చింది. తన భర్త ఒత్తిడి చేసినందుకే ఇలాంటి ఘోరానికి పాల్పడినట్లు పోలీసులతో ఆమె తెలిపింది. మహిళను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి సీఐ లక్ష్మణ్‌రావు తెలిపారు.
కూతురిని చంపేసిన తల్లి