గత ఖరీఫ్ సీజన్‌లో.. వరి, వేరుశనగ, అరటి పంటలకు... రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో.. 16వేల 701 మంది వరి రైతులు, 283మంది వేరుశనగ, 6వేల378మంది అరటి రైతులు ఖరీఫ్ పంటల బీమాకు అర్హ్హత సాధించారు. మొత్తం 2 లక్షల 36వేల 968మంది రైతులు పంటల బీమా పథకంలో నమోదు కాగా... ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం అందించిన పంటల బీమా పథకం ద్వారా కేవలం 23 వేల 332మంది రైతులు 32.49కోట్ల రూపాయల లబ్ధి పొందారు. దీని ప్రకారం ఇంకా 2 లక్షల 13వేల 636 మంది బీమా పరిహారానికి నోచుకోలేదు. ఈ-క్రాప్ నమోదులో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తప్పిందాల వల్లే తాము బీమాకు దూరమయ్యామంటూ రైతులు వాపోతున్నారు.
విజయనగరం జిల్లాలో సుమారు 17వేల మంది కౌలుదార్లు ఉన్నారు. పంటల సాగు పెట్టుబడులకూ వేలాది రూపాయలు వెచ్చించారు. అయితే ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి పంట కీలక దశ వరకు వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో.... కౌలు డబ్బులతో పాటు పెట్టుబడులు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఖరీఫ్ పంటల బీమా కింద పైసా కూడా రాకపోవటంపై రైతులు కన్నీరు కారుస్తున్నారు. ఈ-క్రాప్ నమోదులో క్షేత్రస్థాయి సిబ్బంది తప్పులను సరిదిద్ది రైతులకు బీమా అందించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఖరీఫ్ పంటల బీమా పరిహారం విషయంలో... పంటల కోత ప్రయోగాల్లో గత ఐదు సంవత్సరాల దిగుబడి సగటు శాతాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. లక్ష రూపాయలు దాటిన 3వేల 226 మంది రైతులకు... దశల వారీగా బీమా సొమ్ము విడుదల చేస్తామని తెలిపారు.