MLC Candidate Introductory Program at KGBV Teachers Meet: విజయనగరంలో సమగ్ర శిక్షా అభియాన్ అధికారుల తీరుపై.. కేజీబీవీ సిబ్బంది, టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం సమావేశం ఉందని.. కేజీబీవీ ప్రత్యేకాధికారులు, ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని ఎస్ఎస్ఏ కార్యాలయం నుంచి సమాచారం పంపించారు. ముఖ్యమైన సమావేశమనుకుని అంతా కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ అధికారులెవరూ కనిపించలేదు.
ఈలోపే పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ప్రత్యక్షమయ్యారు. విశాఖ జిల్లాకు చెందిన కేజీబీవీ ఉపాధ్యాయురాలు దేవి ప్రసంగం ప్రారంభించారు. ఏం జరుగుతుందో అర్థం కాక గురువులు అయోమయానికి గురయ్యారు. ఉన్నట్లుండి ఎమ్మెల్సీ అభ్యర్థి పరిచయ కార్యక్రమమని ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపించాల్సిందిగా సీతంరాజు సుధాకర్ కోరినట్లు తెలిసింది.