Gunkalam Jagananna Colony: సాధారణంగా లే-అవుట్ వేసేటప్పుడు ఎక్కడైనా సరే.. భూమిని చదును చేసి ప్లాట్లు వేసి రోడ్లు, కాలువలు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. విజయనగరం జిల్లా గుంకలాం జగనన్న కాలనీల్లో మాత్రం వీటి ఊసే లేదని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో లేఅవుట్‌లో భారీ అవినీతి జరిగిందని విమర్శిస్తున్నారు. గుంకలాంలో జగనన్న కాలనీల్లో అక్రమాలపై జనసేనాని పవన్ కల్యాణ్ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
విజయనగరం మండలం గుంకలాంలో.. 397 ఎకరాల్లో 10 వేల 625 ఇళ్లతో రూపుదిద్దుకుంటున్న జగనన్న కాలనీ.. వైకాపా నాయకుల అక్రమాలకు కేంద్రంగా మారిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పేదల ముసుగులో వైకాపా వారికే ఇళ్లు కేటాయించారని, గుంకలాం లేఅవుట్‌లో అధికార పార్టీ నేతలు కోట్లు దండుకున్నారని నేతలు విమర్శించారు. ఇక్కడ జరిగిన అవినీతిని 'జగనన్న ఇళ్లు- పేదలందరికీ కన్నీళ్లు' కార్యక్రమంలో నేడు పవన్ కల్యాణ్ బహిర్గతం చేస్తారని జనసేన నాయకులు తెలిపారు.