ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vizianagaram Rain Updates: తుపాను హెచ్చరికలతో అధికారుల అలర్ట్​.. క్షేతస్థాయి పర్యటనలో కలెక్టర్ - ఏపీలో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా (జవాద్ పేరు పెట్టారు) మారింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

'జవాద్​' ముప్పుతో అధికారులు అలర్ట్​
'జవాద్​' ముప్పుతో అధికారులు అలర్ట్​

By

Published : Dec 3, 2021, 4:32 PM IST

Updated : Dec 3, 2021, 8:48 PM IST

'జవాద్​' ముప్పుతో అధికారులు అలర్ట్​

Jawad cyclone: జవాద్ తుపాను నేపథ్యంలో విజయనగరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మెంటాడ మండలం ఆండ్ర రిజర్వాయర్​ను పరిశీలించి.. డ్యాం భద్రతకు చేపట్టిన చర్యలు, రిజర్వాయర్​లో ప్రస్తుత నీటి నిల్వ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. ఒక గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు, రిజర్వాయర్​ నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు జలవనురలశాఖ చీఫ్ ఇంజినీర్ సుగుణాకర రావు కలెక్టర్​కు వివరించారు.

సహాయక బృందాలు సిద్ధం..
తుపాను ముప్పు పొంచి ఉన్నందున జిల్లా ప్రజలు, రైతులను అప్రమత్తం చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్య, ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్ బృందాలను సిద్ధం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశమున్న గ్రామాల్లో ముందుగానే నాలుగు రోజులకు అవసరమైన రేషన్ సరుకులు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. గాలులు ఉద్ధృతంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.

పాఠశాలలకు సెలవు..
తుపాను హెచ్చరికలతో జిల్లాలో రెండు రోజులపాటు పాఠశాలు, అంగన్​వాడీలకు కలెక్టర్‌ సూర్యకుమారి సెలవు ప్రకటించారు. తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారిగా కాంతిలాల్‌దండేను నియమించారు.

తుపానుగా మారిన వాయుగుండం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు 420, ఒడిశాలోని గోపాల్​పూర్​కు 530 కిలోమీటర్ల దూరంలో 'జవాద్​' తుపాను కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో తుపాను తీరం వైపునకు కదులుతోందని పేర్కొంది. రేపు ఉదయానికి ఉత్తరకోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని.. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుందని తెలిపింది.

తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరకోస్తా తీరంలో 80-90 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పలుచోట్ల 20 సెం.మీ.కి పైగా వర్షపాతం, 3.5 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షం మెుదలైంది. జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి.

సీఎం సమీక్ష..

జవాద్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. తుపాను ముప్పు దృష్ట్యా..తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: 'జవాద్' తుపానుగా మారిన అల్పపీడనం.. ఎన్​డీఆర్ఎఫ్​ అలర్ట్

Last Updated : Dec 3, 2021, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details