JANASENA NADENDLA MANOHAR: ప్రతిపక్షాలపై వైసీపీ నాయకులు దాడి చేయటం దారుణమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బేవరపేటలో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వారిపై జరిగిన దాడి గురించి బాధితుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన.. మంత్రి బొత్స నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరగటం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు సరైన న్యాయం జరగకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడుతామని ఈ సందర్భంగా మనోహర్ హెచ్చరించారు.
చీపురుపల్లి నియోజకవర్గంలోని బెవరపేట గ్రామంలో 22వ తేదీన గ్రామంలో వైసీపీ నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారని నాదెండ్ల తెలిపారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వైసీపీ నేతలు స్టిక్కర్లను అంటించారన్నారు. అయితే జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన కొంతమంది.. తమ ఇళ్లకు వైసీపీ స్టిక్కర్లను అంటించటాన్ని నిరాకరించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఉందనే ఉద్దేశంతో వారు స్టిక్కర్లను అంటించనివ్వలేదని తెలిపారు.