Lightning strikes In Vizianagaram : మాయదారి పిడుగు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరికొన్ని రోజుల్లో పోలీసుగా విధుల్లో చేరి.., కుటుంబాన్ని ఆదుకుంటాడని అతని తల్లిదండ్రులు కలలు కన్నారు. ఇంతలోనే వారి కలలు ఆడియాశలయ్యాయి. చేతికి అందొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయిన తీరును చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పోస్టుమార్టం గదికి చేరుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్న ఈ ఘటన విజయనగరంలోని గాజులరేగలో చోటు చేసుకుంది.
పిడుగు పడి ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు :ఈ ఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు., విజయనగరం గాజులరేగ ప్రాంతానికి చెందిన ఇజ్రాయిల్(22) తన స్నేహితులతో కలిసి సాయంత్రం సమీప మైదానంలో క్రికెటు ఆడుతున్నాడు. ఇజ్రాయిల్ బ్యాటింగ్ చేస్తుండగా., అఖిల్ బౌలింగ్, సురేష్ అంపియరింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో వీరి ముగ్గురు సమీపంలో పిడుగు పడటంతో ఇజ్రాయిల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడికి దగ్గరగా ఉన్న సురేష్, అఖిల్ తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ఇద్దర్నీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాత పరీక్షకు ఉత్తీర్ణత.. : పిడుగు పాటుకు మృతి చెందిన ఇజ్రాయిల్ స్వతహాగా మంచి క్రికెటర్. గత ఏడాది నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. ఇటీవల కానిస్టేబుల్, ఎస్ఐ కొలువుల రాత పరీక్ష రాయగా, రెండింట్లోనూ ఉత్తీర్ణత సాధించాడు. చిత్తూరు జిల్లాలో ఈ నెల 26న నిర్వహించనున్న కానిస్టేబుల్ ఈవెంటు పరీక్షలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం బయలుదేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా.., ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.