నగరాలు, పట్టణాల్లో అమల్లోకి తేనున్న కొత్త విధానంలో... ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో నిర్దేశిత శాతానికి సమానమయ్యే వరకూ ఆస్తిపన్ను పెరుగుతుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలపై ఒకేసారి అంత భారం పడకుండా... ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుపై 15% మాత్రమే మొదటి సంవత్సరం పెంచుతామని చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఆస్తి విలువ పెరిగినప్పుడు... కొంత పన్ను పెరిగితే నష్టం ఏముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. కొత్త పన్ను విధానంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే అపోహలు తొలగించేందుకు మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రస్తుత అద్దె ఆధారిత పన్ను విధానం లోపభూయిష్టంగా ఉన్నందునే, పారదర్శకత కోసం కొత్త విధానం అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. కొత్త విధానం అమలును ఎన్నికల కోసం వాయిదా వేశారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, కరోనా వల్లే ఏప్రిల్ 1 నుంచి అమలు చేయలేదని బొత్స పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది లేదంటే అప్పటి నుంచే కొత్త విధానం అమల్లోకి తెస్తామన్నారు.
'రెండు నెలల తర్వాత అమలు చేద్దామా?’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 33.60 లక్షల అసెస్‌మెంట్ల నుంచి ప్రస్తుతం ఏటా రూ.1,242.13 కోట్ల పన్ను వసూళ్లు జరుగుతున్నాయని, 15% పన్ను పెంచడం వల్ల అదనంగా వచ్చేది రూ.186 కోట్లేనని తెలిపారు. కొత్త విధానంలో 375 చదరపు అడుగుల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం ఉన్న ఇళ్లకు నెలకు రూ.50 మాత్రమే పన్ను వేస్తున్నామని, అలాంటి ఇళ్లు 3.96 లక్షలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కొత్త పన్ను విధానంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి చోట్ల ఓపెన్ ఫోరం నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతితో దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.