Ayyanna Sensational Comments On Jagan: సాధారణ ప్రజలు ముఖ్యమంత్రిని కలిసి తమ కష్టాలను చెప్పుకోవడానికి వస్తే, వారి సమస్యలను పట్టించుకోలేని విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఉందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రజలు ముఖ్యమంత్రిని చూడటానికి రాగానే ఎందుకు భయపడుతున్నారని మండిపడ్డారు. సాధారణ ప్రజల సమస్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి.. మరి నర్సీపట్నం ఏం చేయడానికి వస్తున్నారు? అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వానికి 7 కాలేజీలకు ప్రతిపాదనలు పంపిస్తే అందులో మూడు మాత్రమే మంజూరయ్యాయని, ఆన్‍లైన్‌లో మాత్రం 16 కాలేజీలకు శంకుస్థాపన చేసేశారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా మెడికల్ కాలేజీలను ఎలా ప్రారంభిస్తారన్నారు. ఇది మోసం కాదా.. పోలీసులు వెంటనే చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. తారురోడ్డు మీద గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు కానీ రూ.600 కోట్లు పెట్టి.. మెడికల్ కళాశాలలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల క్రితం పాడేరులో ప్రారంభించిన మెడికల్ కాలేజీకి ఇప్పటివరకూ దిక్కుమొక్కులేదని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజ్ పెడతానంటే స్వాగతిస్తాం కానీ.. ఇలా మోసం చేయడం సరికాదన్నారు. ఒక దొంగోడికి ఈ రాష్ట్ర పోలీసులు కాపలా కాస్తున్నారని దుయ్యబట్టారు.