నగర పాలక సంస్థగా ఆవిర్భవించిన తర్వాత విజయనగరం తొలి ఎన్నికలకు వెళ్తోంది. ఇందుకోసం యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ నగరపాలికకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరింది.
పురపాలక సంఘం ఏర్పాటులో పూసపాటి వంశీయుల పాత్ర కీలకం. అభినవ ఆంధ్రభోజ బిరుదాంకితులైన ఆనంద గజపతిరాజు ఈ సంఘాన్ని స్థాపించారు. రూ.400 వార్షిక ఆదాయంతో ప్రారంభమై.. ప్రస్తుతం ఏడాదికి రూ.36 కోట్లను ఆర్జిస్తోంది. పారిశుద్ధ్య విధానాన్ని ఆనాడే అమలు చేశారు. 1909-13 మధ్య కాలంలో నెల్లిమర్ల వద్ద గల చంపావతి నదీ ప్రాంతంలో రాణి అప్పలకొండయాంబ నీటి పథకాన్ని ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వీధులకూ కుళాయిలు ఏర్పాటు చేశారు. ఈమె ఘోషాసుపత్రి నిర్మించి స్త్రీలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించారు. 1903లో తొలిసారిగా పట్టణ ఏలికను ఎంపిక చేశారు. దానికి ఛైర్మన్‌గా భూపతిరాజు వెంకటపతిరాజు ఎన్నికయ్యారు. అప్పట్లో ఛైర్మన్ పదవి మూడేళ్లు ఉండేది.
ఆ తరువాత వచ్చిన గుండాల రామావతారం హయాంలోనే కస్పా ఉన్నత పాఠశాల నిర్మాణం జరిగింది. 1959లో జరిగిన ఎన్నికల తరువాత కాలపరిమితి ఐదేళ్లకు మారింది. 1972 నుంచి తొమ్మిదేళ్ల పాటు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. అనంతరం అప్పటి అంజయ్య ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పరోక్ష విధానంలో పునరుద్ధరించింది. 1981-85లో జరిగిన ఎన్నికల్లో పూసపాటి సునీలా గజపతిరాజు ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో ఆమె పదవీ కాలం ఏడాది ఉండగానే కౌన్సిల్ రద్దయింది.