రాష్ట్రంలోని హౌసింగ్ కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనుందని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వానికి ఇదే ప్రధాన కార్యక్రమమని పేర్కొన్నారు. పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా సమయంలో ఉపాధి కల్పించడంతో పాటు పేదలకు లక్షల విలువైన ఆస్తిని సమకూర్చడం, సంపద సృష్టించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 15 లక్షల గృహాలను నిర్మించడం ద్వారా 4 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించడం సాధ్యమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
యజ్ఞంలా ఇళ్ల నిర్మాణం: మంత్రి శ్రీరంగనాథరాజు
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని యజ్ఞంలా చేపట్టి పూర్తిచేస్తామని... రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకు భారం కాకుండా చూసేందుకు మార్కెట్ ధరల కంటే 30 నుంచి 40శాతం తక్కువ ధరలకే నిర్మాణ సామగ్రిని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం, వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల్లో అవసరమైన మౌళిక వసతుల కల్పన, తదితర అంశాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో... గృహనిర్మాణంలో నెలకొన్న సమస్యలు, పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు.
విజయనగరం జిల్లాలో 80 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని, మండలంలోని ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారిని, ప్రతి 20 ఇళ్లకు గ్రామస్థాయి ఉద్యోగికి బాధ్యతలు అప్పగించి పర్యవేక్షించాలని జిల్లా అధికారులకు సూచించినట్టు చెప్పారు. పెద్ద హౌసింగ్ కాలనీల్లో భూగర్భంలోనే విద్యుత్ లైన్లు, ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుళ్లు, తాగునీటి సరఫరా పైప్‌లైన్లు వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. జిల్లాలో గృహనిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు వచ్చే నెలలో మళ్లీ తాను వస్తానని, అప్పుడు నియోజకవర్గ స్థాయికి వెళ్లి పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... Inter Exams: వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు