చెత్త నిర్వహణకు విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న పంథాను ఎంచుకుంది. పెరుగుతున్న జనాభాకు తోడు.. వేగంగా విస్తరిస్తున్న నగరీకరణతో చెత్త నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. నిత్యం నగరంలో 1.25 మెట్రిక్ టన్నుల చెత్త పోగవతుండగా...వాటిలో 48 టన్నులు తడి చెత్తే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా నగరపాలక సంస్థ "హోం కంపోస్టు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లోనే తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసుకుని మొక్కలకు వినియోగించేలా మహిళలను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా అధికారులు ఇంటికి రెండు చొప్పున ప్లాస్టిక్ డ్రమ్ములను ఉచితంగా అందించారు. సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో నగర దీపికలతో అవగాహన కల్పించారు. ఈ ఎరువుతో సొంతంగా మిద్దెసాగు, ఇంటి పెరడును మహిళలు అందంగా తీర్చిదిద్దుకున్నారు .
తాజా కూరగాలు, ఆకుకూరలతోపాటు, పండ్లు ఇంటిపైనే లభిస్తుండటంతో.. చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతున్నాయంటున్నారు. నగరపాలక సంస్థకు చెందిన నగరదీపికలు ప్రతివారం ఇంటింటికి వెళ్లి హోం కంపోస్టు తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా మిద్దెసాగు, పెరటి తోటల పెంపకంపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మొక్కల ఎంపిక, ఎరువులు, చీడపీడల నివారణపై మహిళలకు అవగాహన కల్పించడంతో.. నగరంలో పెద్దఎత్తున మిద్దెసాగుకు ముందుకొచ్చారు. -ఎస్.ఎస్. వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్