ఓటర్లు పోటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 పోలింగ్ శాతం నమోదు చేశారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. విజయనగరం డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో 207 సర్పంచి, 1719 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 642 మంది సర్పంచి, 3791 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. 37 సర్పంచి, 610 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 3,60,181 మంది ఓటర్లకు 3,13,679 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూసపాటిరేగ మండలం చౌడవాడలో పోలింగ్ కేంద్రంలో ఓ అభ్యర్థితో ఓటు వేయించే విషయంలో ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు దాడి చేసుకున్నారు. కుర్చీలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని బయటకు పంపడంతో వివాదం సద్దుమణిగింది.
లాటరీలో వరించిన విజయం
కొల్లాయివలస పంచాయతీలో వైకాపా బలపరిచిన అభ్యర్థిని పైడి సుజాత లాటరీలో విజయం సాధించారు. ప్రత్యర్ధి దువ్వు చిన్నమ్మలపై గెలుపొందారు. ఇక్కడ ఇద్దరికి చెరో 690 ఓట్లు వచ్చాయి. రీకౌటింగ్ చేసినా అదే ఫలితాలు రావడంతో అభ్యర్థు.ల ఇష్టం మేరకు లాటరీ తీయగా సర్పంచిగా పైడి సుజాత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.