విజయనగరం సంస్థానం వారసుడు, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. 3 దేవస్థానాల ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి ఈనెల 2న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేసింది. ధర్మకర్త తొలగింపునకు దేవాదాయ చట్ట నిబంధనలను అనుసరించడంలో అధికారులు విఫలమయ్యారని తేల్చి చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై కోదండ రాముడి విగ్రహం ధ్వంసం కాకుండా నివారించడంలో విఫలమయ్యారనే కారణంతో అశోక్ గజపతిరాజును రామతీర్థంలోని రామాలయం, విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వర స్వామి దేవస్థానాల ఆనువంశిక ధర్మకర్త, ఛైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఈ ఉత్తర్వులను రద్దుచేయాలని కోరుతూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ‘అధికారులు చట్ట నిబంధనలను పాటించలేదన్న పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తోంది. ఈ కేసులో ముందస్తు నోటీసు ఇవ్వలేదు, అభియోగం నమోదు చేయలేదు. దేవాదాయశాఖ అధికారులు వారి విచక్షణను చట్ట నిబంధనలకు లోబడి ఉపయోగించడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పిటిషనరు తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఒకవేళ పిటిషనరుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తే.. చట్ట నిబంధనలను పాటించాలి. పిటిషనరు సైతం తన వాదనలను లేవనెత్తవచ్చు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట... ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత - AP high court latest news
17:51 January 28
దేవస్థానాల ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు ఉత్తర్వుల రద్దు
ఆ ఆలోచనే ప్రభుత్వానికి లేదు: అశోక్ గజపతిరాజు
రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని అశోక్ గజపతిరాజు తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఈ విషయం అర్థమై ఉండొచ్చని పేర్కొన్నారు. తనను తొలగించేటప్పుడు దేవాదాయ చట్టం కింద నోటీసు ఇవ్వాలన్న నిబంధనను ఉల్లంఘించారని, గతంలో 9 ఆలయాల ధర్మకర్త పదవి నుంచి తనను తప్పించి.. వాటి భూములు, ఆస్తులపై పడటం అందరికీ కనిపిస్తోందని చెప్పారు.
ఇవీ చదవండి