High court judges: జూనియర్ న్యాయవాదులు కష్టపడితేనే వృత్తిలో రాణించగలరని, అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆదివారం విజయనగరంలోని జిల్లా న్యాయస్థాన భవన సముదాయంలో.. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనతోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ టి.రాజశేఖర్, జస్టిస్ చీమలపాటి రవి హాజరయ్యారు. ముందుగా సీనియర్ న్యాయవాది దివంగత జి.రామ్మోహనరావు చిత్రపటానికి నివాళులర్పించారు. న్యాయవాది జి.రామ్మోహనరావుతో తనకున్న అనుబంధాన్ని జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వివరించారు. బాధ్యతాయుతమైన వ్యక్తిగా, న్యాయవాదిగా గేదెల రామ్మోహన్ రావు సమాజానికి ఎనలేని సేవలందించారని పలువురు కొనియాడారు.
జిల్లాతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని జస్టిస్ చీమలపాటి రవి పంచుకున్నారు. పెద్దలను గౌరవించాలని, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని జస్టిస్ టి.రాజశేఖర్ సూచించారు. జిల్లా న్యాయస్థానానికి నూతన భవన సముదాయాన్ని హైకోర్టు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని జిల్లా ఉన్నతాధికారుల్ని కోరారు. అనంతరం నలుగురు న్యాయమూర్తులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.కల్యాణ చక్రవర్తి, ఎస్పీ దీపికా ఎం.పాటిల్, జేసీలు మహేష్ కుమార్, జె.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.