ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mansas Trust: విద్యాసంస్థల విషయంలో మీ జోక్యం ఎందుకు?: హైకోర్టు - HIGH COURT INQUIRY INTO A PETITION FILED AGAINST THE MANSAS TRUST EO

మాన్సాస్‌ ట్రస్ట్‌కు చెందిన విద్యాసంస్థల విషయంలో ఈవో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మీకున్న పాత్ర ఏమిటని ఈవోపై ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయస్థానం.....ట్రస్ట్‌ ప్రయోజనాలు కాపాడటం కోసం ఉన్నారా? లేక వ్యతిరేకించడం కోసమా ? అని.. ఘాటుగా వ్యాఖ్యానించింది. ట్రస్ట్‌కు చెందిన విద్యాసంస్థల సొమ్ము ఉపసంహరణ విషయంలో జోక్యంచేసుకోవద్దని ఆదేశించిన ధర్మాసనం..విద్యాసంస్థలకు చెందిన అకౌంట్లను స్తంభింపచేయాలని ఈవో బ్యాంకులకు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఖాతాల నిర్వహణకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

HIGH COURT
హైకోర్టు

By

Published : Jul 28, 2021, 4:38 AM IST

మాన్సాస్‌ ట్రస్ట్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చి 3 న జారీచేసిన జీవో 75 ను రద్దుచేయాలని కోరుతూ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై.....హైకోర్టులో విచారణ జరిగింది. ఛైర్మన్‌ ఇచ్చిన ఆదేశాలను ఈవో పాటించడంలేదని.....ఆశోక్‌గజపతిరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌గా సంచయిత గజపతిరాజు నియామకం, ట్రస్ట్‌ వ్యవస్థాపక కటుంబ సభ్యుల నియామకం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు రద్దు చేసినా..... పాలకమండలి ఏర్పాటు నిమిత్తం జారీచేసిన జీవో 75 ని రద్దు చేయలేదనే కారణాన్ని చెబుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు తీర్పుతో మాన్సాస్‌ ఛైర్మన్‌గా అశోక్‌గజపతి రాజు బాధ్యతలను స్వీకరించినా విధులు నిర్వహించనీయకుండా ఈవో అడ్డుకుంటున్నారని ధర్మాసనానికి తెలిపారు. 2020 మార్చి నుంచి విద్యాసంస్థల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని.....చెల్లింపు విషయంలో ఈవోకు పాత్ర లేదని వాదించారు. జీవో 75 ను సాకుగా చూపుతున్నారని....ఛైర్మన్‌ సూచనలకు కట్టుబడి ఉండేలా ఈవోను ఆదేశించాలని కోర్టును కోరారు.

Mansas Trust: విద్యాసంస్థల విషయంలో మీ జోక్యం ఎందుకు?: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఈవో తరఫున న్యాయవాది మాధవరెడ్డి వాదనలు వినిపించారు. ఈవో సహకరించడం లేదన్న వాదనలు సత్యదూరం అన్న వారు...ఛైర్మన్‌ లేఖల ద్వారా కోరిన సమాచారం ఇవ్వడానికి కొంత సమయం కావాలని మాత్రమే ఈవో కోరారన్నారు. 2004 నుంచి ఆడిట్‌ జరగలేదన్నారు. జీవో 75 పై కౌంటర్‌ వేసేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించారు. ఈ సమయంలో స్పందించిన ధర్మాసనం... ట్రస్ట్‌ ఈవోపై తీవ్రంగా మండిపడింది. ట్రస్టుకు చెందిన విద్యాసంస్థల విషయంలో కార్యనిర్వహణ అధికారి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించింది. మీకున్న పాత్ర ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్రస్ట్‌ ప్రయోజనాలు కాపాడటం కోసం ఉన్నారా? లేక వ్యతిరేకించడం కోసమా ? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ట్రస్ట్‌కు చెందిన విద్యాసంస్థల సొమ్ము ఉపసంహరణ విషయంలో జోక్యంచేసుకోవద్దని ఆదేశించింది. విద్యాసంస్థలకు చెందిన అకౌంట్లను స్తంభింపచేయాలని ఈవో బ్యాంకులకు రాసిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఖాతాల నిర్వహణకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. విద్యాసంస్థల్లో సిబ్బందికి జీతభత్యాలు చెల్లింపు , రోజువారీ కార్యకలాపాల అవసరాలు నిమిత్తం బ్యాంకుల నుంచి సొమ్ము ఉపసంహరించుకునేందుకు ప్రిన్సిపల్స్‌, కరస్పాండెంట్లను అనుమతించింది. సిబ్బందికి జీతాలు చెల్లించకుండా ఈవో నిలువరించడం సరికాదని స్పష్టంచేసింది. చట్టనిబంధనల మేరకే ఈవో వ్యవహరిస్తారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని నమోదు చేసింది.

మరోవైపు పాలకమండలి సమావేశం కోసం మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో ఈ ఏడాది జూన్‌ 9 న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ అమలును నిలుపుదల చేసింది. ట్రస్ట్‌ విషయంలో జిల్లా ఆడిట్‌ అధికారులు నిర్వహిస్తున్న ఆడిట్‌ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టంచేసింది. పారదర్శకత కోసం ఆడిట్‌ నిర్వహణ మంచిదేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆడిట్‌ ప్రక్రియను నిలువరించలేమని తేల్చిచెప్పింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ సర్కారు 2020 మార్చి 3 న జారీచేసిన జీవో 75 రద్దు విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న దేవదాయ శాఖముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఈవో డి.వెంకటేశ్వరరావుకు నోటీలు జారీచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేస్తూ....మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


ఇదీ చదవండి


CM Jagan: గ్రామ సచివాలయాలకు వెళ్లకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయి?: సీఎం

ABOUT THE AUTHOR

...view details