విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 11.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తవలస మండలంలో అత్యధికంగా 47, భోగాపురంలో 38.6, జామిలో 27.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాల్లో అలల తాకిడి పెరిగింది. 26వ జాతీయ రహదారి కోతకు గురైంది.
ఎడతెరిపి లేని వర్షాలకు సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న, 3,250 హెక్టార్లలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఆదేశించారు. వాయుగుండం తీరం దాటే సమయంలో 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో దండోరా వేయించడంతోపాటు, సచివాలయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశామన్నారు.