విజయనగరం జిల్లాలో భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లాయి. గ్రామాల్లోకి వరదనీరు చేరింది. పలుచోట్ల వాగులకు గండిపడి నీరు రహదారులపైకి చేరింది. ఫలితంగా రాకపోకలు స్తంభించాయి. విజయనగరంలోని ద్వారకానగర్, నాయుడుపేట, గోకాపేట ముంపునకు గురయ్యాయి. గోకాపేటలో రైల్వే మార్గానికి పక్కన ఉన్న కాలనీలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది. అక్కడున్న పూరిళ్లు పూర్తిగా నీటమునిగాయి.
పెద్దచెరువుకు భారీ ఎత్తున నీరు చేరి... సమీపంలోని నాయుడుపేట, ద్వారకానగర్‌లోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. గరుగుబిల్లి మండలం రావుపల్లి, తెర్లాం మండలం గంగనపాడు, కొరటం గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. పార్వతీపురంలోనూ పలు కాలనీలు జలమయమయ్యాయి. చీపురుపల్లి మండలంలోని రాయవాని చెరువు పొంగి వరదనీరు గ్రామాల్లోకి వచ్చింది.
నెల్లిమర్ల మండలంలో మొయిద బీసీ సంక్షేమ వసతిగృహం ముంపునకు గురైంది. బాడింగి మండలం బొత్సవానివలసలో పశువులపాక కూలి 2గేదెలు మృతిచెందాయి. దత్తిరాజేరు మండలం భోజరాజపురంలో సరవ వాగుకు గండిపడి పొలాలు నీటిమునిగాయి. డెంకాడ మండలం గొడిపాలెం వద్ద పాలగెడ్డ ఉద్ధృతంగా ప్రవహించటంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెంటాడ మండలం బీదవలస కునేటీ వాగు ఉద్ధృతికి వరిపొలాలు నీటమునిగాయి.