Grain Farmers Problems: పంట కోసి కల్లంలో పోసి ఉంచామని రైతులు వాపోతున్నారు. రైతు భరోసా కేంద్రంలో పోసి సంచులలో నింపి ఉంచామని.. ధాన్యం కొనుగోళ్లు జరగలేదని, పెట్టుబడి ఖర్చులకు ఇబ్బందిగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక పంట కోసి రెండు నెలలు గడుస్తున్నా.. ధాన్యం రైతు భరోసా కేంద్రం నుంచి కదలటం లేదని రైతులు అంటున్నారు. అధికారులను ప్రశ్నిస్తే వెళ్తాయి అంటున్నారని.. కూలీ డబ్బుల చెల్లించటానికి ఇబ్బందులు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం జిల్లాలో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవి మచ్చుకు మాత్రమే. జిల్లాలో ఈ ఏడాది 5.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 2.80లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. మిగిలిన ధాన్యం.. కల్లాల్లోనే ఉన్నా అధికారులు మాత్రం సంక్రాంతికి ముందు నుంచే కొనుగోళ్లు నిలిపివేశారు. తాజాగా జిల్లాలో అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు వచ్చాయి. ఇది ఏ మాత్రం సరిపోదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.
"పంట కోసి నెల రోజులు అవుతోంది. పంట కోసిన కూలీలకు నగదు చెల్లించలేదు. 80 వేల రూపాయల పెట్టుబడి ఖర్చు అయ్యింది. కూలీ డబ్బులు చెల్లించటానికి నా దగ్గర నగదు లేదు. ఈ ధాన్యం ఎప్పుడు అమ్ముడవతుందో తెలియటం లేదు." -రైతు
ఖరీఫ్ ధాన్యం కళ్లాలకే పరిమితం కావటం వల్ల.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు, కూలీల డబ్బులు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో మారుతున్న వాతావరణం, ఎలుకల బెడదతో రైతులు కలవరం చెందుతున్నారు.