విజయనగరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం కనులపండువగా జరిగింది. కొవిడ్ నిబంధనల నడుమ అధికారులు ఉత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. చదురుగుడి నుంచి కోట వరకు మూడుసార్లు సిరిమానును ఊరేగించారు. పూజారి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. డీసీసీబీ వేదిక నుంచి ఉత్సవాన్ని మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స, అవంతి తిలకించగా.. కోట నుంచి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీక్షించారు.
సిరిమానోత్సవం ప్రారంభానికి ముందు అశోక్‌గజపతిరాజు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం.. అశోక్ పేదలకు ప్రసాదాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.