ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా..? - ganja transportation

గంజాయి రవాణాకు విజయనగరం జిల్లా కేంద్రంగా మారింది. టన్నుల కొద్దీ గంజాయి జిల్లాలో పట్టుబడుతోంది. అక్రమార్కులు రోజుకో కొత్త పంథాతో... పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. ప్రత్యేక వాహనాల్లో... గంజాయి రవాణాను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.

టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా

By

Published : Nov 10, 2019, 6:40 AM IST

టన్నుల కొద్ది గంజాయి... ఎలా తరలిస్తున్నారో తెలుసా

రాష్ట్రంలో గంజాయి పేరు వినగానే గుర్తొచ్చేది విశాఖ మన్యం. ఏవోబీ సరిహద్దుల్లో... పండించే గంజాయిని... పాడేరు, నర్సీపట్నం, సీలేరు మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలించేవారు. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ పెరగడం వల్ల... అక్రమార్కులు రూటు మార్చారు. అందుకు విజయనగరం జిల్లాను ద్వారంగా మార్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున గంజాయి దొరకడమే ఇందుకు నిదర్శనం.

గంజాయిని అనుకున్న ప్రాంతాలకు తరలించేందుకు... అక్రమార్కులు అనుసరిస్తున్న పంథాలు పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయి. సరకు రవాణా కోసం వాహనాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. బయటనుంచి చూస్తే సాధారణ వాహనం లాగానే ఉన్నా... లోపల సీన్ వేరే ఉంటోంది. వాహనాల్లోని ఖాలీ స్థలాలను అనుకూలంగా మార్చుకుంటూ... ప్రత్యేక ర్యాకులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో టన్నుల కొద్ది గంజాయిని నింపేస్తున్నారు. అలాంటి ప్రయత్నాల్లో అప్పుడప్పుడూ పోలీసులకూ చిక్కుతున్నారు.

ఈ ఏడాది జనవరిలో కొత్తవలస సమీపంలో... విశాఖ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన కారు నిండా గంజాయిని గుర్తించి అధికారులే విస్తుపోయారు. జులైలో... సాలూరు-సుంకీ ఘాట్‌లో పి.కోనవలస వద్ద ఓ వ్యాన్ తిరగబడింది. అందులోనూ... ఖాళీ బుట్టల మాటున ఏర్పాటు చేసిన అరలో 900 కిలోల గంజాయి దొరికింది. అదే నెలలో... విజయనగరం నడిబొడ్డున 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అక్టోబర్​లో భోగాపురం సమీపంలోని లింగాలవలస వద్ద.. కోటిన్నర విలువైన 1,400 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ నెల ఒకటిన.. తుమ్మికాపల్లి వద్ద ఖాళీ కంటైనర్‌లో... 500కిలోల గంజాయిని తరలిస్తుండగా... పోలీసులు పట్టుకున్నారు.

విజయనగరం జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని... జిల్లాలో ఎక్కడా డంప్ అవుతున్న దాఖలాలు లేవని పోలీసులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తుంటే భారీ ట్రాఫిక్ జామ్ అవుతోందని... అందువల్ల ర్యాండమ్ తనిఖీలు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. సరిహద్దుల్లో భద్రత పెంచినట్లు వివరించారు. అయితే ఈ వ్యవహారంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులు... విద్యార్థులు బలవుతున్నారు. కేవలం గంజాయి రవాణా చేస్తున్న వారినే కాకుండా... అసలు సూత్రదారులు, కొనుగోలుదారులను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details