పేదవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని.. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తూ... మహిమ గల విగ్రహాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అనిల్ కుమార్ వివరించారు.
''విజయనగరానికి చెందిన శ్రీనివాసరావు, రామసత్యం, ఛత్తీస్గడ్కు చెందిన కిరణ్ కుమార్ ఓ బోరువెల్ సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు ముగ్గురూ.. అక్రమంగా డబ్బు సంపాదించే ఆలోచనలో భాగంగా మహిమ గల విగ్రహాల పేరుతో మోసాలకు పూనుకున్నారు. విశాఖకు చెందిన తమ స్నేహితుడు వెంకటరావు సహకారంతో 1818 సంవత్సరం నాటి ఈస్టిండియా కంపెనీకి చెందిన సిపాయి కంచు విగ్రహాన్ని సమకూర్చుకున్నారు. దీని సహాయంతో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా వ్యాపారంలో నష్టపోయిన నెల్లిమర్ల కు చెందిన కాళ్ల మహేష్ అనే వ్యక్తికి ఎర వేశారు. ఆయనకు 5 లక్షల రూపాయలకు మహిమ గల దేవతా విగ్రహాన్ని అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు ఆయనతో ముందస్తుగా 20వేల రూపాయలు తీసుకుని సిపాయి విగ్రహాన్ని ఇచ్చారు. ముఠా మోసాన్ని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి ముఠాను అరెస్ట్ చేశాం. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నాం'' - అనిల్ కుమార్, డీఎస్పీ