ఫిబ్రవరి 18న విజయనగరం జిల్లాలోని పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవికుమార్ (23) హత్య సంచలనం సృష్టించింది. కెంగువ రవికుమార్ అనే వ్యక్తిని పినవేమలి గ్రామ శివారు ప్రాంతంలో చంపి... మృతదేహం కాళ్లకు రాయి కట్టి నూతిలో పడేసిన కేసులో... నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. యువకుడిని కిరాతకంగా హత్యచేశారన్నారు. బాలి పైడిరాజుకు తెలిసిన మహిళతో... రవికుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతోనే హత్య చేసినట్టు గుర్తించామని చెప్పారు.
"ఫిబ్రవరి 17న రవికుమార్.. బాలి పైడిరాజుతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం రవిపై దాడి చేసిన బాలిపైడి రాజు.. చివరికి అంతమొందించాడు. తరువాత నారాయణరావు, సత్యనారాయణ, ఉదయ్ కిరణ్ సహాయంతో మృతదేహనికి బండరాయిని కట్టి నూతిలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.... దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు" అని ఎస్పీ రాజకుమారి చెప్పారు. ఘటనను ఛేదించిన పోలీసులను అభినందించారు.