సాధారణ బియ్యంలో పోషకాలు కలిపిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ పైలట్ ప్రాజెక్టును విజయనగరం జిల్లాలో అమలు చేస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం జిల్లాలో 78.7 శాతం పిల్లల్లో... 75.5 శాతం మహిళల్లో రక్తహీనతో ఉన్నట్లు తేలటంతో... తొలి ప్రాధాన్యతగా ఈ జిల్లాలను ఎంపిక చేశారు. రక్తహీనత నివారించేందుకు ఈ బియ్యం దోహదపడతాయన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా అందజేస్తున్నారు. ధాన్యాన్ని రైస్ మిల్లుల్లో మరపట్టించినప్పుడే...రక్తహీనత తగ్గించేందుకు ఉపకరించే ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ బి-12 వంటి కీలక సూక్ష్మపోషకాలు చేర్చటం ద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 21 రైస్ మిల్లుల్లో ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ తయారవుతోంది. ఏడాదికి లక్ష 10 వేల మెట్రిక్ టన్నుల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా అవసరమైన బియ్యాన్ని ఇతర జిల్లాల నుంచి తెప్పించనున్నారు. గతేడాది తొలుత బొబ్బిలిలో, ఆరు నెలల తరువాత పార్వతీపురం నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలుచేశారు. ఈ నెల నుంచీ జిల్లా వ్యాప్తంగా 34 మండలాల్లోనూ సరఫరా చేయనున్నారు. తొలిదశలో ఈ బియ్యంపై పలుచోట్ల ప్రజల్లో అపోహలు తలెత్తాయి. ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల్లో అపోహలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు... ఫోర్టిఫైడ్ బియ్యం లాభాలపై ప్రచారం చేస్తున్నారు. రేషన్ పంపిణీదారులచేతనే అవగాహన కల్పిస్తున్నారు. త్వరగా అలసిపోవటం, జుట్టురాలటం, అరచేతులు, అరికాళ్లు పాలిపోవటం, వ్యాధినిరోధకశక్తి తగ్గటం వంటి సమస్యలకు ఈ బియ్యం మందుగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. గర్భిణీలు, చిన్నారులే గాకుండా వ్యవసాయ, భవననిర్మాణ కూలీలూ ఎక్కువమంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని... వారికీ ఈ బియ్యంతో లబ్ధి ఉంటుందని చెప్పారు. ఇందులో ఉన్న బియ్యం గింజల్లో పోషకాలు ఉండవని.... బియ్యంతోపాటుగా పోషకాలను కలిపి అందజేస్తున్నామని అధికారులు స్పష్టతనిచ్చారు.