విద్యార్థులకు వెంకయ్యనాయుడు సందేశం Venkaiah Naidu Interacts with GMR IT Students: విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ ఐటీ విద్యార్థులతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచానికి నాగరికతను నేర్పింది మన భారత్ అని గర్వంగా చెప్పారు. దేశ భవిష్యత్తు, పురోగతి విద్యార్థులపై ఆధారపడి ఉంది అని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు పురోగతి సాధించాలి అని పేర్కొన్నారు.
ఆ దిశగా ప్రయాణిస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోగలరని ఆయన తెలిపారు. పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృ భాష, గురువును ఎన్నటికీ మర్చిపోకూడదని వెంకయ్యనాయుడు విద్యార్థులకు హితవు చెప్పారు. ప్రతి ఒక్కరూ మాతృభాషలోనే మాట్లాడుతూ.. మాతృభాషకు అధిక ప్రాధాన్యతనివ్వాలి అని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు దీన్ని గుర్తు పెట్టుకుని ఆచరించాలని చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దేశ రాష్ట్రపతి, దేశ ప్రధాని లాంటి గొప్పవారందరూ మాతృభాషలో చదివిన వారేనని చెప్పారు.
తాను కూడా మాతృభాషలోనే చదివినట్లు తెలిపారు. గ్రామంలోనే పుట్టి, వీధి బడిలో చదివి.. ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగినట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రపంచంలోనే శక్తివంతమైనది మాతృభాష అని నమ్మిన మోదీ.. దేశ ప్రధాని స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ దుస్తులు ధరించటానికే ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు మన యాస, భాషలోనే మాట్లాడాలి అని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం ఆటపాటలతో పాటు యోగా చేసి శరీర దారుఢ్యం పెంచుకోవాలి అని వెంకయ్యనాయుడు అన్నారు. ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రవేశ పెట్టిన యోగా తీర్మానాన్ని స్వాగతించి 172 దేశాలు కూడా వాటిని పాటిస్తున్నాయని ఆయన వెల్లడించారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని కోరారు. దీంతోపాటు ఎన్నికల్లో నిజాయితీపరులైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
అసెంబ్లీలో పరుష పదజాలాన్ని ఉపయోగించిన వారిని మరల ఎన్నుకోరాదని ఆయన తెలిపారు. దీంతోపాటు కుటుంబ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి గొప్ప పోరాట యోధుల చరిత్రను తెలుసుకొని వారి స్ఫూర్తితో పని చేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం వెంకయ్యనాయుడును జీఎంఆర్ సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు.
"దేశ భవిష్యత్తు, పురోగతి విద్యార్థులపై ఆధారపడి ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు పురోగతి సాధించాలి. ఆ దిశగా ప్రయాణిస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోగలరు. పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృ భాష, గురువును ఎన్నటికీ మర్చిపోకూడదు. విద్యార్థులు మానసిక ఉల్లాసం కోసం ఆటపాటలతో పాటు యోగా చేసి శరీర దారుఢ్యం పెంచుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రవేశ పెట్టిన యోగా తీర్మానాన్ని స్వాగతించి 172 దేశాలు కూడా వాటిని పాటిస్తున్నాయి. దీంతోపాటు విద్యార్థులు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించి.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి." - వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి
ఇవీ చదవండి: