Pitani Satyanarayana : అందరూ జగన్మోహన్ రెడ్డి చట్టంలోనే పని చేయాలి.. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సును ఎన్నికల స్టంట్‌గా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధికారికి స్వేచ్ఛగా పనిచేసే అధికారం లేదని తెలిపారు. అందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డి చట్టానికి లోబడి పని చేయవలసిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ తో కలిసి రాజాం మండలం శ్యాంపురంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ ఒక్కరు మాట్లాడినా కేసులు పెడతారని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు అంతా సమష్టిగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావును గెలిపించాలని కోరారు.
అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అంతా అంకెల గారడీ.. అబద్ధాలు తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్.. యువతను మోసం చేస్తున్నారని పితాని తెలిపారు. నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారా..? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం వచ్చేసింది... గ్లోబల్ సమ్మిట్ అంతా సార్వత్రిక ఎన్నికల స్టంట్‌గానే భావిస్తున్నామని చెప్పారు. ఏ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టిందో ప్రకటించాలని, టైం బాండ్ గురించి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని టీడీపీ కోరుతుందని తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటం చేస్తుంటే వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు డ్రామాలు ఆడటం తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని మండిపడ్డారు. విశాఖను రాజధాని చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి పితాని ఎద్దేవా చేశారు.