విజయనగరం జిల్లా జామి మండలం అలమండకు చెందిన ఈ మహిళలంతా మామిడి తాండ్ర తయారీలో ఆరితేరారు. సాంప్రదాయంగా కుటీర పరిశ్రమగా కొనసాగుతున్న ఈ రంగాన్ని ఇక్కడ మహిళలు వారసత్వంగా కొనసాగిస్తున్నారు. అయితే... సాంప్రదాయ పద్ధతుల్లోనే తాండ్ర తయారు చేస్తుండటంతో కాల క్రమంలో రాబడి తగ్గిపోతోంది. ఇలాంటి వారికి విశాఖకు చెందిన గీతం వర్సిటీ అండగా నిలిచింది. మహిళలకు ఆధునిక తయారీ పద్ధతులపై శిక్షణ ఇవ్వడంతోపాటు...శుచి, రుచిగా తయారీలో మెలకువలు నేర్పుతోంది. మెరుగైన ఆహార ఉత్పత్తుల తయారీ లక్ష్యంగా భారత ప్రభుత్వం గీతం వర్సిటీకి బయోటెక్ ప్రాజెక్ట్ మంజూరు చేసింది. అందులో భాగంగానే వర్సిటీకి చెందిన సిబ్బంది.. గ్రామీణ మహిళలకు పుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు.
సుమారు 50 లక్షల రూపాయలతో మామిడి మ్యాంగో జ్యూస్, అరటిలో టిస్యూకల్చర్, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను గీతం వర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ విభాగాల్లో జామి మండలంలోని అలమండ గ్రామంతోపాటు చుట్టు పక్కల నిరుద్యోగ మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో పూర్తిస్థాయిలో నైపుణ్యం సాధించిన మహిళలు... ఆధునిక విధానంలో... నవీన పరికరాలు ఉపయోగించి మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు.