Farmers Protest Against Highway: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర మీదుగా నిర్మిస్తున్న విశాఖ-అరకు జాతీయ రహదారి బైపాస్ కోసం వ్యవసాయ భూములను తీసుకోవద్దని కోరుతూ బాధిత రైతులు ధర్నా చేపట్టారు. అఖిల భారత కిసాన్ సంఘం, పెందుర్తి-బొడ్డవర హైవే భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రహదారి కోసం తమ భూములను తీసుకోవద్దని, అంతంత మాత్రంగా మిగిలిన పొలాలను తీసుకుని తమ పొట్టకొట్టొద్దంటూ నిరసనలు చేపట్టారు. రహదారి విస్తరణకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలంటూ.. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
Farmers Protest: రహదారిపై రైతుల ధర్నా.. ఎంపీ బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకొని
అనంతరం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విశాఖ-అరకు జాతీయ రహదారి NH-516Bకి విజయనగరం జిల్లాలో.. కొత్తవలస, వేపాడ, ఎస్.కోట, ఎల్.కోట మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల రైతుల నుంచి భూసేకరణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ గ్రామాల్లో ఇప్పటికే గ్యాస్ లైన్, పలు రకాల జాతీయ రహదారులతో పాటు.. సుజల స్రవంతి, పోలవరం కాల్వల తవ్వకాలకు రైతుల భూములు సేకరించారు. తిరిగి విశాఖ-అరకు జాతీయ రహదారి NH-516B కోసం మరోసారి అధికారులు భూసేకరణకు భూములను గుర్తిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అరకొరగా మిగిలిన భూముల్లోనూ మరోసారి భూ సేకరణ చేస్తే.. రైతులు ప్రధాన జీవనాధారం కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు ఉద్యమబాట పట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.