ఒడిశా రాష్ట్రంలోని రాయపూర్ నుంచి విశాఖ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి విజయనగరం జిల్లా భూపోరాట కమిటీ ఆందోళన చేపట్టింది. కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. జాతీయ రహదారికి భూసేకరణ ఆపాలని, రహదారి పేరుతో రైతుల పొట్ట కొట్టొద్దన్నారు. ప్రత్యామ్నాయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న 26 నంబరు రహదారిని అభివృద్ధి చేసుకోవాలని రైతులు నినాదాలు చేశారు.
అంతంత మాత్రంగా నీటి వనరులున్న జిల్లాలో జలాశయాల ఆయకట్టు భూముల్లో రోడ్డు నిర్మిస్తే చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతు సంఘం ఉపాధ్యక్షుడు నరసింహారావు పేర్కొన్నారు. 26వ జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామన్న అధికారులు... తాజాగా కొత్త రహదారి కోసం భూ సేకరణ జరపటం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొత్త ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.