దేవుడు వరం ఇచ్చినా... పూజారి వరం ఇవ్వడు అన్నట్టుంది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటని అమ్ముకునేందుకు కష్టాలు తప్పడం లేదు. మార్కెట్‌కి వెళితే కొనేవారు లేక... పెట్టిన పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి, మెరకముడిదం మండలాల రైతులు ఈ సమయంలో వేలాది ఎకరాల్లో నేల చిక్కుడును సాగు చేస్తారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో పంటల దిగుబడి బాగుంది. కానీ...ఆ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది.
సుమారు రెండు నెలలుగా లాక్డౌన్ విధించడంతో, రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన ధర లేకపోవడంతో... చాలా వరకు చిక్కుడు పంటలను అమ్ముకునే స్థితి లేక పశువులకు వేస్తున్నారు. మెరకముడిదం మండలం యాడికి గ్రామంలో సుమారు 30 ఎకరాల వరకు చిక్కుడు సాగులో ఉంది. రైతుల శ్రమకు తగ్గ ఫలితం వచ్చింది. కానీ మార్కెట్లో అమ్ముకునేందుకు పరిస్థితులు లేకపోవడంతో బాధపడుతున్నారు.