Preparation of Jaggery: విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన చెరకు రైతులు బెల్లం తయారీలో లాభదాయక విధానాలు అనుసరిస్తూ మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. బెల్లంతో పాటు, ఉపఉత్పత్తులను తయారు చేస్తూ స్వతహాగా అమ్మకాలు సాగిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శృంగవరపుకోట మండలం భవనీపురానికి చెందిన కాండ్రేగుల సన్యాసినాయుడు అనే రైతు.. తనకున్న 5ఎకరాల విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తూ రసాయనలతో కూడిన బెల్లం తయారు చేసేవారు. దిమ్మెల రూపంలో బెల్లం తయారీ చేయటం వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకునేవారు. ఐదేళ్ల క్రితం అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తల సూచనలు ఇతన్ని ఆలోచింపజేశాయి. దీంతో సేంద్రీయ పద్ధతులపై దృష్టి సారించారు. పంట సాగులోనే కాకుండా బెల్లం తయారీలో సైతం సేంద్రీయ విధానాలు అవలంబించారు. ఈ క్రమంలో హైడ్రోస్ వంటి రసాయన పదార్ధాలకు బదులు మునగాకు, బెండ, కలబంద, నిమ్మరసం వంటి వాటిని బెల్లం తయారీలో వినియోగించారు.
మొదటి ఏడాది ఈ పద్ధతిలో సేంద్రీయ బెల్లాన్ని అరకిలో, కిలో పరిమాణంలో తయారు చేసి సుమారు పది టన్నుల వరకు విక్రయించారు. మంచి ఫలితాలు రావటంతో ప్రతి ఏటా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. సేంద్రీయ విధానాల ద్వారా రెండింతల లాభం చేకూరుతోందని సన్యాసినాయుడు తెలిపారు. పంట సాగు, బెల్లం తయారీలోనూ పెట్టుబడులు తగ్గటంతో పాటు, దిగుబడులు పెరిగాయంటున్నారు. బెల్లాన్ని దిమ్మెల రూపంలో కాకుండా చిన్నచిన్న ముక్కలుగా చేయటం వల్ల టన్నుకు ఐదు కిలోల వరకు దిగుబడి పెరిగిందంటున్నారు. మార్కెట్లో రసాయనాలతో తయారు చేసిన బెల్లం దిమ్మెలు 35-40రూపాయల వరకు పలుకుతుండగా.. సేంద్రియ ముక్కల బెల్లం కిలో 100 రూపాయలకు విక్రయిస్తు అధికాదాయం పొందుతున్నారు.
పంటలు పండించటమే కాదు వాటి ఉప ఉత్పత్తుల తయారీ దిశగా కూడా సాగినప్పుడే రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని శాస్త్రవేత్తలు, నిపుణుల నుంచి తరచుగా వినిపిస్తున్న సలహాలివి. సన్యాసినాయుడు ఈ సలహాలను తూ.చా. పాటిస్తున్నారు. సేంద్రియ పద్ధతి బెల్లం నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా బెల్లాన్ని పొడి, ఉండల రూపంలో తయారు చేస్తున్నారు. అదేవిధంగా బెల్లం తేనె కూడా తయారు చేస్తున్నారు. వండిన బెల్లం పాకాన్నిచల్లార్చి ప్రత్యేక బాటిల్లో నిల్వచేస్తున్నారు. ఇలా సిద్ధంచేసిన పాకం తేనెను లీటర్ 140రూపాయలు చొప్పన విక్రయిస్తున్నారు. ఇలా ఉప ఉత్పత్తుల తయారీతో అధిక ఆదాయం సమకూరుతోందని సన్యాసినాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.