విజయనగరం జిల్లాలో రబీ వరి సాధారణ విస్తీర్ణం 4వేల 418 హెక్టార్లు కాగా.... ఈ ఏడాది 7వేల 948 హెక్టార్లలో సాగైంది. ఫలితంగా 40వేల 536 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. పంటను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం 41 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట చేతికొచ్చి మూడు నెలలు కావస్తున్నా.. కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అనేక నిబంధనలతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తీసుకునేందుకు నిర్వాహకులు నిరాకరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
పేదలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు స్టార్టప్ యంత్రాలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. దీనివల్ల నూకశాతం తక్కువగా ఉంటుందని తెలిపింది. అయితే స్టార్టప్ యంత్రాలు భారం భరించలేమంటూ మిల్లర్లు ముందుకు రాకపోవడంతో.... ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. అధికారులు పలుమార్లు మిల్లర్లతో చర్చలు జరపగా.. విజయనగరం డివిజన్‌లో కొత్త యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారు.
కానీ.. పార్వతీపురంలో డివిజన్‌లో ఇంకా పాత యంత్రాలనే వినియోగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు మందగించాయి. నెలల తరబడి ఎదురుచూడలేక రైతులు ప్రైవేట్ వ్యక్తులకు నష్టానికి ధాన్యం అమ్ముకుంటున్నారు. వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. సేకరణకు నోచుకోని ధాన్యం.. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరుబయట, ఇళ్లు, పురుల్లోనూ ఉండిపోయింది. వర్షాకాలం రావడంతో ఏ క్షణం ఏ ఆపద ముంచుకొస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.