రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. మద్యం అమ్మకాలు నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం బహిరంగంగానే లభ్యమవుతోంది. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఎక్కువగా మద్యం కొని నిల్వ ఉంచుకున్నాయన్న ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఒడిశా నుంచి అక్రమ మార్గాల్లో జిల్లాకు మద్యం రవాణా అవ్వటం ఒక ఎత్తయితే.. ఇక్కడున్న మద్యం దుకాణాల నుంచే నిల్వలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావటం మరో ఎత్తు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటంతో అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలనూ తనిఖీ చేయాలని ఆదేశాలొచ్చాయి. ఆ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు చేసి, సరకు నిల్వలను లెక్కిస్తున్నారు.
రెండు చోట్ల భారీగా తేడాలు
జిల్లాలో 168 ప్రభుత్వ మద్యం దుకాణాలుండగా వీటిని దశలవారీగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తం 21 దుకాణాలను తనిఖీ చేశారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో పలు లోపాలు వెలుగుచూశాయి. మక్కువ దుకాణంలో రూ.1.70 లక్షల మేర సరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. గుమ్మలక్ష్మీపురంలోనూ రూ.22 వేల మేర తేడా ఉంది. ఆయా దుకాణాల నిర్వాహకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. గురువారం కూడా జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు సాగాయి. విజయనగరం పట్టణంలో మొత్తం 17 దుకాణాలుండగా.. రెండురోజుల్లో 6 దుకాణాలను పరిశీలించారు.
దుకాణాల సిబ్బంది పనేనా..