విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో త్వరలో జరగనున్న ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హరిజవహర్ లాల్ పరిశీలించారు. పోలింగ్ ముందు రోజు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. పోలింగ్ సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్, లెక్కింపు ప్రాంతాలను చూశారు.
పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారి సూచించారు. ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా నిబంధనల మేరకు ఎన్నికలు సజావుగా నిర్వహించాలని... అందుకు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఇతర ఏర్పాట్లుపై ఆయన సూచనలు చేశారు.