FACE BASED ATTENDANCE SYSTEM:ముఖ ఆధారిత హాజరు విధానం.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గిరిజన గూడేల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ విధులు నిర్వహించడం కంటే హాజరు నమోదుకే ఎక్కువ భయపడుతున్నారు.
విజయనగరం జిల్లా కొత్తవలస ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు బుధవారం రోజున హాజరు కోసం పడిన తిప్పలు వర్ణనాతీతం. యాప్‌లో లొకేషన్ చూపించకపోవడంతో.. కొన్ని గంటలపాటు కుస్తీ పట్టారు. చివరికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేశారు. వీళ్లే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 33వేల మంది ఉద్యోగులదీ అటు-ఇటుగా ఇదే సమస్య.
ఆలస్యమైతే ఆబ్‌సెంట్ పడుతుందనే ఆందోళనతో.. కార్యాలయాలు మొదలవగానే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సర్వర్ మొరాయిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కొన్నిచోట్ల D.D.O.లు లేదా ఆయా శాఖల మండలస్థాయి అధికారులు లాగిన్ అయితేనే.. మిగతా వారికి హాజరు పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.
తౌడమ్మ, మంగ.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సమ్మంగిపాడు, కురుకుట్టి పంచాయతీల్లో ఎంఎల్హెచ్పీ (MLHP)లుగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా చెట్ల కింద పడిగాపులు పడటానికి హాజరు సమస్యే కారణం. ఆరోగ్య ఉపకేంద్రం వద్ద మొబైల్ సిగ్నల్ రాకపోవడంతో.. కిలోమీటర్ దూరంలోని ఈ చెట్టు దగ్గరికొచ్చి హాజరు నమోదు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.