విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం పోవడం లేదు. రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి తరలివచ్చిన అటవీ ఏనుగులు ఎప్పటికప్పుడు పంటను ధ్వంసం చేస్తున్నాయి. వేసవి కాలంలో పొలంలో పంట లేకపోవటం కొంత ఊపిరి పీల్చుకున్న రైతులు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు దాడి చేయటంతో లబోదిబోమంటున్నారు.
ఏనుగుల బీభత్సం.. పంటతో పాటు పరికరాలు ధ్వంసం
రెండేళ్ల క్రితం ఒడిశా నుంచి తరలివచ్చిన అడవి ఏనుగుల బెడద పార్వతీపురం ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఇప్పటికీ వీడటం లేదు. వేసవిలో పొలాల్లో పంటలు లేకపోవటంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. పంట చేతికి వచ్చే సమయంలో ఏనుగులు బీభత్సానికి రైతులు బలవుతున్నారు. దీంతో అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని రైతులు కోరుతున్నారు.
పది రోజులుగా కోమరాడ మండలం కల్లికోట దుగ్గి, ఆర్తి, కుమ్మరిగుంట, తదితర గ్రామాల్లో గజరాజుల గుంపు సంచరిస్తూ.. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ సమయంలో ఎటువైపు నుంచి కర్రిరాజుల గుంపు వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాత దుగ్గిలో రైతు పొలంలో పంటను పూర్తిగా ధ్వంసం చేసిన ఏనుగుల గుంపు.. ట్రాక్టర్, తోటలోని డ్రిప్ పరికరాలు, పైపులను పాడు చేశాయి. ఈ దాడిలో 70వేల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు విచారం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. ఇక్కడి నుంచి ఏనుగుల తరలింపుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి...