విజయనగరంలోని కొత్త అగ్రహారానికి చెందిన మంగళగిరి గోదాదేవి అనే 86 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె... శుక్రవారం డిశ్ఛార్జి అయ్యారు. వృద్ధురాలిని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేసి, పండ్లు అందించారు.
ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.... మనలో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే కరోనాను జయించవచ్చు అనడానికి వృద్ధురాలు నిదర్శనమన్నారు. 86 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె ఎంతో మనోనిబ్బరంతో ఒంటరిగా కరోనాను ఎదుర్కొని, జయించారన్నారు. ప్రజలెవ్వరూ కరోనా అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం వలన కరోనా రాకుండా అడ్డుకోవచ్చునన్నారు. కరోనా సోకినా బలవర్థక ఆహారం తీసుకుంటే నయం అవుతుందన్నారు.తరచూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.