అస్తవ్యస్తంగా మురుగు కాలువలు.. దోమలు, పందులకు ఆవాసాలుగా కాలనీలు Vizianagaram: చిన్నపాటి వర్షం కురిసినా చాలు., విజయనగరం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇలాంటప్పుడు భారీ వర్షం కురిసిందంటే.. లోతట్టు ప్రాంతాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. నాలుగైదు రోజులు వరద నీటిలోనే గడపాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో నాయకులు, అధికారుల పర్యటనలు, పరామర్శలు, సమస్య పరిష్కరిస్తామనే హామీలు పరిపాటిగా మారాయి. ఇదిలా ఉండగా.. నగరంలో ఇటీవల మురుగునీటి సమస్య తీవ్రమైంది. చిన్నపాటి వర్షం పడినా నీరు ప్రధాన వీధులు ద్వారా కాలనీల్లోకి చేరుతోంది. భారీ వర్షం కురిస్తే.. పలు ప్రాంతాలను మురుగు ముంచెత్తుతోంది. నూతనంగా నిర్మించిన ప్రాంతాల్లో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టం లేదు. దీంతో., మురుగునీరు ప్రవహించే అవకాశం లేక ఆవాస ప్రాంతాలు దుర్వాసనా భరితంగా మారుతున్నాయి. మరోవైపు పందులు, దోమల ఆవాసాలకు కేంద్రమవుతున్నాయి.
విజయనగరం నగరపాలక సంస్థ 51.62 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇందులో 50డివిజన్లు ఉండగా., మురుగు నీరు పారదల కోసం 343.5 కిలోమీటర్ల సీసీ కాలువలు, 70కిలోమీటర్లు కచ్చా కాలువులు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మురుగు కాల్వల నిర్మాణాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐదున్నర కోట్లు.. 2021-22లో 2.93కోట్లు నగరపాలక సంస్థ ఖర్చు చేసింది. ఇలా రెండేళ్ల వ్యవధిలో 8.43 కోట్లు ఖర్చు చేసినా.. మురుగునీటి సమస్య పూర్తిగా తొలగిపోలేదు. నగరంలోని శివారు కాలనీలు, విలీన పంచాయతీల్లో మురుగు కాల్వలు అధ్వానంగా మారాయి.
ముఖ్యంగా.. కె.ఎల్ పురం, వైఎస్ఆర్ నగర్, ధర్పమపురి, పద్మావతి నగర్, తోటపాలెం, సాయినగర్, నాయుడు కాలనీ, వినాయక నగర్, టౌన్ సెంటర్ లే-అవుట్, ద్వారకా నగర్, ఎస్వీఎన్ నగర్, కామాక్షి నగర్, కల్యాణ్ నగర్, గోపాల్ నగర్, వుడాకాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, అయ్యప్ప నగర్, దాసన్నపేట, కొత్తపేట, కంటోన్మెంట్, సీఆర్ కాలనీ, జమ్ము, గాజులరేగ, నటరాజ్ కాలనీ, పాలనగర్, ఆర్టీసీ కాలనీ, కొత్తాగ్రహారం, కాళీఘాట్ కాలనీ, పరిస్థితి దయనీయంగా మారింది. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా., స్పందన లేదంటున్నారు. చూస్తాం.. చేస్తాం అన్న మాటలు తప్ప.. చేతలు లేవని బాధితులు మండిపడుతున్నారు.
మురుగునీటి సమస్యపై విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాములు నాయుడు వివరణ ఇస్తూ., నిధుల లభ్యత మేరకు ప్రాధాన్యత క్రమంలో మురుగునీటి కాల్వలు నిర్మిస్తున్నాం. అన్ని నిధులతో వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సమగ్ర కాలువల వ్యవస్థ నిర్మాణం ప్రత్యేక గ్రాంటు వస్తేనే సాధ్యమవుతుంది. అయితే.. భూగర్భ డ్రైనేజీ కాలవల నిర్మాణంపై ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. విజయనగరం.. నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన నేపథ్యంలో క్రమంగా విస్తరిస్తోంది. అదేవిధంగా శివారు కాలనీల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయల పెంపులో భాగంగా శాశ్వత మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. భవిషత్తు అవసరాలు, విపత్తుల దృష్ట్యా.. భూగర్భ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని.. ఈ దిశగా పాలక ప్రభుత్వాలు అడుగులు వేయాలని.. పురప్రముఖులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: