విజయనగరంలో గతకొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సూచనల మేరకు ఈనెల 25,26 తేదీల్లో ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, వైద్యాధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో కరోనాను కట్టడి చేయడానికి అధికారుల సహకారంతో పలు చర్యలను తీసుకున్నామని తెలిపారు.
వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించటం కూడా దీనిలో భాగమని ఆయన పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా లాక్‌డౌన్‌కు ఈనెల 31 వరకు పొడిగించారన్నారు. కరోనాను ముందుగానే గుర్తించటం ద్వారా, దానిని నయం చేయటం సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు.