కలెక్టర్ హరి జవహర్ లాల్ అధికారులతో కలిసి టెలీ స్పందన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలు ఫోన్లో కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించారు. మండలంలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ వేసేలా చూడాలని.. మండలంలో ఒకే చోట వాక్సినేషన్ వేయడం వల్ల వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నామని.. తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వాక్సిన్ అందుబాటులో లేక కష్టం అవుతోందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలు సక్రమంగా అందుతున్నా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేశారు.
ప్రతి ఆసుపత్రికి ఒక నోడల్ అధికారిని వేశామని.. వారు స్పందించకుంటే సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్ కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులపై నోడల్ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా చూడాలని జేసీకి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కొన్ని వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా లేదన్న ఫిర్యాదుపై.. స్పందించారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టేలా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.