ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. రేషన్ వాహనం వీధిలోకి వస్తే రోడ్డుపై వరుసలో నిల్చుని గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉందని విజయనగరం జిల్లా సాలూరులో లబ్ధిదారులు వాపోతున్నారు. వాహనం వద్దకు వచ్చిన వారికి మాత్రమే సరుకులు పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదివరకైతే ప్రతి నెల 1 నుంచి 15 తేదీ వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు అందించేవారు. తమకు వీలున్న సమయంలో షాపుకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
రేషన్ సరుకులు ఇంటింటికి కాదు... వీధి వరకే..
ఇంటింటికి రేషన్ సరుకులు అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విజయనగరంలోని సాలూరు పట్టణంలో పంపిణీ ప్రారంభించి వారం గడచినా.. లబ్ధిదారులకు సరుకులు అందలేదని వాపోతున్నారు.
సాలూరులో 22 రేషన్ డిపోల పరిధిలో 16,900 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయం పరిధిలోని తొమ్మిది రూట్లలో 9 రేషన్ వాహనాల ద్వారా రోజుకి 845 మందికి సరుకులు ఇవ్వాలి. ఆదివారం నాటికి 5,915 మందికి పంపిణీ చేయాలి. కానీ గడిచిన వారం రోజుల్లో మూడు వేల మందికి మాత్రమే సరుకులు ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే నెలాఖరు నాటికి కూడా పంపిణీ పూర్తవదు. దీనిపై సీఎస్‌డీటీ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. ఇంటింటికి వెళ్లి పంపిణీ వేగవంతం చేయాలని వాహన నిర్వాహకులను ఆదేశించామని తెలిపారు.
ఇదీ చదవండి:పల్లె పోరు: ఎంపీ భార్య.. వార్డు అభ్యర్థినిగా