రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మాస్కులు పంపిణీ చేసేందుకు సుమారు 13 లక్షల 5 వందల మాస్కులు అవసరమని మెప్మా అంచనా వేసింది. విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్‌కు 7 లక్షల 50 వేలు, పార్వతీపురానికి లక్షా 66 వేల 500, సాలూరుకు లక్షా 53 వేల 600, బొబ్బిలి పురపాలికకు లక్షా 56 వేల 900, నెల్లిమర్ల నగర పంచాయతీకి 73 వేల 500 మాస్కులు అవసరమని లెక్కగట్టింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు సుమారు లక్షన్నర మాస్కులను మెప్మా తయారు చేసింది. జిల్లాలో డ్వాక్రా సంఘాల ద్వారా మాస్కులను తయారుచేసే పనిలో జిల్లా మెప్మా యంత్రాంగం నిమగ్నమై ఉంది. మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో వాలంటీర్లు, కార్యదర్శుల ద్వారా ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
జిల్లాలో కొనసాగుతోన్న మాస్కుల పంపిణీ
కరోనా కట్టడికి వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం సహా మాస్కులను ధరించడం కూడా తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ వ్యక్తికీ మూడు మాస్కులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాస్కుల తయారీ బాధ్యతను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు అప్పగించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో మాస్కుల తయారీ, పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది.
మాస్కుల తయారీలో నిమగ్నమైన మహిళలు